
ఒక నాయకుడిపై నమ్మకం ఉంటే ఆ అభిమానం మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తుంది. దర్శిపర్రులో అదే ఆత్మీయత ఆవిష్కృతమైంది. పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోడె కాళీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్ కార్యక్రమం సాధారణ రాజకీయ కార్యక్రమంలా కాకుండా గ్రామ ప్రజల అభిమానానికి, ఆయనపై ఉన్న నమ్మకానికి అద్దం పట్టేలా సాగింది. కోడె కాళీ తన ఇంటి నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరిన సమయంలో గ్రామంలోని ప్రతి గడప నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, యువకులు, పెద్దలు ఆయన వెంట పాదయాత్రగా కదిలారు. అడుగడుగునా ప్రజల అభిమానం, ఆత్మీయ పలకరింపులు, మద్దతు నినాదాలతో దర్శిపర్రు గ్రామం సందడిగా మారింది. ఒక నాయకుడు ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిస్తే ఆ ప్రజలు కూడా సమయం వచ్చినప్పుడు ఆయనకు అండగా నిలుస్తారనే విషయాన్ని ఈ నామినేషన్ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. పదవులు, రాజకీయాలు తాత్కాలికం కావచ్చు, కానీ ప్రజల మనసుల్లో సంపాదించుకున్న అభిమానం మాత్రం ప్రత్యేకం. కోడె కాళీ నామినేషన్‌కు గ్రామస్తులు స్వచ్ఛందంగా కుటుంబ సమేతంగా తరలిరావడం వెనుక ఉన్నది ఆ అభిమానమేనని స్థానికంగా చర్చ సాగుతోంది. నాయకుడికి ప్రజలే బలం, ప్రజల అభిమానమే నిజమైన గుర్తింపు. దర్శిపర్రులో కోడె కాళీ నామినేషన్ కార్యక్రమం ఈ విషయాన్ని మరోసారి చాటిచెప్పింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: