ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీ సాధించా.. తాడేపల్లిగూడెం మండల అభివృద్ధికి కృషి చేస్తా: నేకూరి కిరణ్ కుమార్
తాడేపల్లిగూడెం, నవంబర్ 10:
జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన నేకూరి కిరణ్ కుమార్‌కు ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఆయనకు అభినందన పురస్కారం అందించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో ఆయనకున్న అనుబంధాన్ని, ఉద్యమానికి అందించిన సహకారాన్ని నాయకులు ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో మంగళవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేకూరి కిరణ్ కుమార్‌ను ఘనంగా సత్కరించి అభినందించారు.
ప్రజాసేవే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం!
సన్మానానికి స్పందించిన జడ్పీటీసీ నేకూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. 2006 నుంచి 2011 వరకు కడియద్ద గ్రామ సర్పంచ్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించానని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనకు అవకాశం కల్పించిందని, మండల ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు.
తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానన్నారు.
అభివృద్ధికి అగ్రనేతల సహకారం తీసుకుంటా!
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు తదితర ముఖ్య నాయకుల సహకారంతో అవసరమైన నిధులు తీసుకువచ్చి మండల అభివృద్ధికి కృషి చేస్తానని కిరణ్ కుమార్ తెలిపారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా!
గతంలో తాను తాడేపల్లిగూడెం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశానని కిరణ్ కుమార్ గుర్తుచేశారు. మండలంలో ఉద్యమానికి మంచి నాయకత్వం ఉందని, అధినాయకత్వం మరింత చొరవ తీసుకుని ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి గొల్లపెల్లి శ్రీనివాసరావు, మాజీ జిల్లా అధ్యక్షుడు రత్నరాజు, దూలపల్లి శ్రీనివాస్, గాలింకీ ప్రేమ్ కుమార్, పాతపాకల నాని, సీనియర్ నాయకులు బోల్లిపో రత్నాజీ, వీరికొండయ్య, కండెల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: