ఓట్ల కొనుగోలుతో నా మెజార్టీ తగ్గించారు.. రాజకీయాలు కాదు, ప్రజాసేవే నా లక్ష్యం!
తాడేపల్లిగూడెం, నవంబర్ 11:
నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం.. సర్పంచ్ నుంచి పలు కీలక పదవులు చేపట్టిన ప్రస్థానం.. తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంకట రామన్నగూడెం ఎంపీటీసీగా విజయం.. అయితే తనకు రావాల్సిన మెజార్టీని ఓట్ల కొనుగోలు ద్వారా తగ్గించారని ఆరోపిస్తూ సీనియర్ నేత పత్సా రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను నిజాయితీగా ఎంపీటీసీగా విజయం సాధించానని, తనకు సుమారు 400 ఓట్ల మెజార్టీ రావాల్సి ఉండగా, కూటమి అభ్యర్థి తెరవెనుక జరిగిన ఓట్ల కొనుగోలు కారణంగా కేవలం నాలుగు ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చిందని ఆరోపించారు.
ఓట్ల కొనుగోలు వ్యవహారంలో గొర్రెల శ్రీధర్, చింత సుధాకర్ కీలకంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. రీకౌంటింగ్ ద్వారా ఫలితాన్ని మార్చేందుకు నాలుగు గంటలకు పైగా ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారని, ప్రస్తుతం అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు.
1981 నుంచి రాజకీయ ప్రస్థానం.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు!
1981 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నానని పత్సా రామయ్య తెలిపారు. గతంలో సర్పంచ్‌గా, సొసైటీ చైర్మన్‌గా, తణుకు సీడీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించానని గుర్తుచేశారు. తన హయాంలో గ్రామంలో రహదారులు, మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశానన్నారు.
ఈ వయసులో తనకు వ్యక్తిగత రాజకీయ అవసరాలు లేవని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానన్నారు.
ఈ పదవీకాలంలో వడ్డి రఘురాం నాయుడు సహకారంతో మండలానికి అధికంగా నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈలి కుటుంబం, కొట్టు కుటుంబాలతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు.
తనను ఎంపీటీసీగా గెలిపించిన జగ్గన్నపేట, వెంకట రామన్నగూడెం గ్రామాల ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో మునగాల రాంబాబు, దారపురెడ్డి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: