పెంటపాడు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా: ఎంపీటీసీ బర్ల జయరాంబాబు

పెంటపాడు ఎంపీటీసీ-3 గా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు.. గ్రామ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తా
పెంటపాడు, నవంబర్ 11 (మెగా గళం):
ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పెంటపాడు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పెంటపాడు ఎంపీటీసీ-3 సభ్యుడు బర్ల జయరాంబాబు తెలిపారు. తన విజయానికి సహకరించిన గ్రామ ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాల ప్రజలకు ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన జయరాంబాబు.. తన గెలుపు వెనుక అన్ని వర్గాల ప్రజల సహకారం ఉందని పేర్కొన్నారు. రెడ్డి, ఎస్సీ, వెలమ, కాపు తదితర సామాజిక వర్గాల ప్రజలు అందించిన మద్దతును ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. ప్రజల ఆశీస్సులతో బాధ్యతాయుతమైన పదవిని చేపట్టానని, వారి సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
పెంటపాడు సమస్యలపై ప్రత్యేక దృష్టి
గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని జయరాంబాబు అన్నారు. అదేవిధంగా గ్రామంలో చెత్త నిర్వహణకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని అధికారులను కోరనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జయరాంబాబు
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్నాధపురంలో పెంటపాడు ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించగా, కోర్టు వ్యవహారాల కారణంగా పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్రామాల్లోనే మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీ అమలుపై ప్రజలకు స్పష్టత లేదని విమర్శించారు.
18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, 50 ఏళ్లు దాటిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి పింఛన్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులు, బియ్యం, వంటనూనె, పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటా
ఎంపీటీసీగా తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామంలోని ప్రతి సమస్యపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని బర్ల జయరాంబాబు తెలిపారు. ప్రజలు కూడా తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి కృషి చేస్తానన్నారు. తనకు పదవి కంటే ప్రజల నమ్మకం, గ్రామ అభివృద్ధి ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఉండ్రాజవరపు రాజు, మొఖమాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
By: ఆకుల రమేష్

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *