పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదు.. టీడీపీకి విధేయుడిగానే కొనసాగుతా: మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు
జనసేనలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.. వదంతులు నమ్మవద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి
పెంటపాడు: పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని తాను కాదని, తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పెంటపాడు టీడీపీ మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు స్పష్టం చేశారు. తాను టీడీపీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నానంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటూ, అధిష్టానం సూచనల మేరకు పనిచేస్తున్నానని తెలిపారు.
తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంతో పలువురు పార్టీ కార్యకర్తలు ఫోన్లు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఈ పరిణామం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నమ్మవద్దని కోరారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల మల్లికార్జునరావు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు. పెంటపాడు మండలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తానని కిలపర్తి వెంకట్రావు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీసీ చైర్మన్ బండారు వెంకట్రావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు సిరాపరపు వెంకట్రావు, చెప్పుల వాసు, నక్క సాంబశివరావు, చీపురుపల్లి సాంబశివరావు, దత్తు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: